శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర ఎపిసోడ్ 3
1. లక్ష్మీదేవి శ్రీహరి పై అలిగి భూలోకము చేరుట .
మహాఋషులు యథోచితముగా యజ్ఞమును ప్రారంభించిరి . మండల యజ్ఞము పూర్తియగు సమయమునకు శ్రీ మహావిష్ణువు యజ్ఞ గుండమునందు ప్రత్యక్షమై యజ్ఞ ఫలము నందుకొని వైకుంఠము చేరుకొనెను . శ్రీహరిని భృగు మహర్షి వక్షస్థల మందు తన్నినది మొదలు లక్ష్మీదేవి నారాయణుని పై అలిగి " స్వామీ , మీ వక్షము నా నివాసస్థానము అని మీకు తెలియును , ఆ మహర్షి
నా స్థానమున కాలితో తన్నగా వానిని మీరు ప్రేమింతురా ! నన్నెంత అవమాన పఱచితిరి .
అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ , కూలోక , భువర్ లోక , సువర్ లోక , తపోలోక , మహాలోక , జనర్లోక సత్య లోకంబులు
పదునాల్గు లోకంబుల కది నేతపై , ముప్పది మూడుకోట్ల దేవతలకు దేవ దేవుండవై , ఎనుబదినాలుగు లక్షల జీవరాసులకు రక్షణకర్తవైన విన్ను ఒక మహర్షి కాలదన్న మీరది సహించి వాని పాదము లొత్తుటయా ! నేను ఈ అవమానమును భరింపజాలకున్నాను " అనెను .
అందులకు పద్మనాథుడు “ లక్ష్మీ: ఏల నీవు బాధ పడుచున్నావు , నేను భక్తుల భక్తికి బద్ధుడైన విషయము నీకు తెలియును గదా ! భృగువు మన బిడ్డ , బిడ్డల తప్పిదమును తల్లి దండ్రులు మన్నింతురు గాని , శిక్షించరు గదా ! అదియును గాక కార్యార్థియై నన్ను తన్నినాడు . భృగువు మన భక్తుడు . మన భక్తుడు మనలను అవమానపరచునా ! నా మాట విను లక్ష్మీ " అని ఓదార్చెను .
“ నాదా! సమయమునకు తగిన సమాధానము చెప్పుటలో తమకు తమరే సాటి యనునది నే నెఱుంగనిదాననా , నాకు జరిగిన అవమానమును నేను సహించ లేను , మీకు , నాకు ఉన్నటువంటి ఋణానుబంధము నేటితోనే తీరిపోయినది . నన్ను అసమాన పరచిన ఆ మహర్షిని శిక్షింపక వదలను . “
మనలను వేరు చేసిన దుర్మార్గుడు వారి బ్రాహ్మణ జాతి భూలోకములో దరిద్రులై విద్యలను అమ్ముకొని జీవించెదరు గాక " అని శపించి , శ్రీవారి పాదములకు బ్రణమిల్లి ఎంత బ్రతిమాలి నను లెక్కచేయక భూలోకమున కొలాపురంబుచేరి తపమాచరించుచుండెను .
2. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవిని వెదకుచు భూలోకము చేరుట ,
శ్రీహరి భృగుమునికి చేసిన సన్మానమునకు లక్ష్మీ దేవి యలిగి దివిని విడచి భువికి చేరుటచే వైకుంఠమునందు దరిద్రదేవత తాండవించుచుండెను . వైకుంఠము జ్యోతిలేని మందిర మాయెను . వైకుంఠ వాసులు నారాయణుని చెంతజేరి యెటు లైనను లక్ష్మీ దేవిని వైకుంఠమునకు దరలించు భారము మీదే యని విన్నవించు కొన్నారు .
శ్రీ మహావిష్ణువునకు ఏమి చేయుటకు తోచక భూలోకము జేరి చెట్టు లనక , గుట్టలనక , పుట్టలనక , మిట్టలనక తిరిగి తిరిగి వేసారి తుదకు అన్నాహార ములు లేక " లక్ష్మీ , లక్ష్మీ : " యని విలపించుచు మయూర , మర్కట , జంతు జలములతోను , గజ , సింహ , శార్దూల , భల్లూక రాజములతో లక్ష్మిని ఎచ్చోట నైనా జూచితిరా యని యడుగుచూ , కొండలు , కోనలు , అరణ్యంబుల వెదకుచూ , తుద కెచ్చటనూ గానరాక , తిరుమల తిరుపతి యందు ఆదివరాహుని క్షేత్రమందు చేరి యొక చింత చెట్టు క్రిందనున్న పాము పుట్టలో ప్రవేశించి లక్ష్మిని ధ్యానము చేయుచు తపస్సులో నిమగ్ను డాయెను .
3. లక్ష్మీ వద్దకు వెళ్ళి నారదుడు , నారాయణుని పరిస్థితిని వివరించుట .
వైకుంఠము పాడుపడిన వార్త నారదమహర్షి విని సత్యలో కానికి వెళ్ళి తన తండ్రిగారైన బ్రహ్మదేవునితో " జనకా ! మీరు నాకు చెప్పిన మేరకు శ్రీ మహావిష్ణువు భువియందు అవతరించునట్లు చేశాను . అందువల్ల లక్ష్మీనారా యణులకు యెడ బాటు అయ్యి లక్ష్మి దేవి కొల్లాపురమున తపస్సు చేయుచున్నది .
శ్రీహరి ఆదివరాహ క్షేత్రమునందు ఒక పాము పట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక శుష్కించిపోయి యున్నాడు . కనుక మీరు ఎట్లయిననూ యోచించి శ్రీమన్నారాయణ మూర్తికి ఆహారము సమకూర్చవలసినది " అని ప్రార్థించెను .
బ్రహ్మ దేవుడు యోచించి నారదుని లక్ష్మికడకు పంపి , తాను కైలాసము జెరెను . మహేశ్వరుడు బ్రహ్మను గౌరవించి విశేషము లేమని ప్రశ్నించెను . పితామహుడు శంకరునితో “ శివా : లక్ష్మీనారాయణుల కలహమునకు కారణములు నీలకంటునకు విపులీకరించి , ప్రస్తుతము నారాయణుడు నిద్రాహారములు లేక యువవాసములు చేయుచున్నాడు .
మనమిద్దరము ఆవు దూడా రూపములు ధరించి విష్ణువునకు ఆహారముగా క్షీరమును యిచ్చినచో కొంత మేలు గలుగును " అనెను . ఆ మాటలు విని శివుడు సమ్మతించెను .
కొల్హాపురములో నుండు లక్ష్మీ వద్దకు వెళ్ళి నారదుడు భక్తి శ్రద్ధలతో నమస్కరించెను . లక్ష్మీ దేవిని చూచి నారదుడు " జగన్మాతా ! వైకుంఠములో యుండవలసిన నీవు సామాన్య స్త్రీ వలె కాషాయవస్త్రములు ధరించి యిచ్చట తపస్సు చేసుకొనుచున్నావు " అని ఆశ్చర్యము వెలిబుచ్చుచు ప్రశ్నించెను .
లక్ష్మీ దేవి నారదుని చూచి పొంగివచ్చు దుఃఖమును ఆపుకొని వారి కలహము గూర్చి నారదునకు వివరముగా చెప్పెను .
ఆ మాటలు విన్న నారదుడు , కాల మహిమ తల్లీ . మీరు వైకుంఠమునుండి వచ్చినది మొదలు మిమ్ములను వెదకుచు నారాయణుడు వైకుంఠము వీడి భూలోకమున శేషాద్రి కొండల యందు చింత చెట్టు క్రిందనున్న వల్మీకములో తలదాచుకొని యున్నారు .
అతను యింతవరకు నిద్ర ఆహారములు లేక నీరసించి లక్ష్మీ , లక్ష్మి ! అని కలవరించుచునే యున్నారు . కావున మీరు బ్రహ్మ , మహేశ్వర్ల సహాయముతో శ్రీహరికి ఆహారము సమకూర్చవలసినదిగా చెప్పి శెలవు తీసికొని వెళ్ళిపోయెను .
4. బ్రహ్మ మహేశ్వరులు గోవత్స రూపములు ధరించుట
భర్త పరిస్థితి విన్న లక్ష్మీదేవి మరింత దిగులు పడి భర్త ఆకలి తీర్చుటకు మార్గము తోచక బ్రహ్మ మహేశ్వరులు ప్రార్థించెను లక్ష్మీదేవి ప్రార్ధన విన్న బ్రహ్మ మహేశ్వరులు లక్ష్మీదేవి ఎదుట ప్రత్యక్షమైరి.
వారిరువురికి దండ ప్రణామములు ఆచరించి తన భర్తతో కలిగిన కష్టములను గూర్చి వివరింప శివదేవుడు బ్రహ్మదేవుడు కొంత తడవు యోచించి బ్రహ్మదేవుడు ఆవు గానూ శివుడు దూడగా మారుతము.
నీవు గొల్లభామ గా అవతారం ఎత్తి మమ్ములను చంద్రగిరి రాజ్యమును పాలించుచున్న రాజునకు విక్రయించిన మేమవాల్మీ కములో నున్న ని నాదునకు ఆహారముగా క్షీరముమోసాగేదము. అని చెప్పగా లక్ష్మీదేవి అందులకు సమ్మతించెను.
Sri Venkateswara Swamy Jeevitha Charitra Episode 3
Sri Venkateswara Swamy Jeevitha Charitra Episode 3
0 Comments